అత్యాచారానికి పాల్పడితే మధ్యప్రదేశ్‌లో మరణమే! | Sakshi
Sakshi News home page

అత్యాచారానికి పాల్పడితే మధ్యప్రదేశ్‌లో మరణమే!

Published Mon, Dec 4 2017 6:26 PM

MP assembly passes bill awarding death for rape  - Sakshi

మధ్యప్రదేశ్‌ : పన్నెండేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరి శిక్ష విధించాలంటూ సోమవారం మధ్యప్రదేశ్‌ శాసనసభ ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో పాటు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఆమోదం కోసం త్వరలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడినట్లైతే కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణించేంతవరకు జీవిత కాలపు శిక్ష విధిస్తారు. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడితే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేటట్లు ఈ బిల్లు రూపొందించారు. 

అలాగే బాలికలపై వేధింపులకు పాల్పడినా జైలు శిక్ష మరింత కఠినంగా విధించేటట్లు బిల్లుకు రూపం ఇచ్చారు. ఈ బిల్లు గురించి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మాట్లాడుతూ 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారు మనుషులు కారని, వారు దయ్యాలతో సమానం అని వ్యాఖ్యానించారు. వారికి జీవించే హక్కు లేదని అన్నారు. పదే పదే వేధింపులకు పాల్పడే వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధిస్తామని తెలిపారు. గత నెల కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటి వెళ్తున్న బాలికపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అవ్వడంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement